పార్టీలోకి రావాల్సిందిగా కోటంరెడ్డిని ఆహ్వానించిన టిడిపి నేతలు

సుముఖత వ్యక్తం చేసిన కోటంరెడ్డి

nellore-tdp-leaders-meet-mla-kotamreddy-sridhar-reddy

అమరావతిః ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మాజీ మంత్రులు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమర్‌నాథ్ రెడ్డి, ఇతర టిడిపి నేతలు కలిశారు. పార్టీలోకి రావాల్సిందిగా ఆయన్ను ఆహ్వానించారు. ఇందుకు కోటంరెడ్డి కూడా సుముఖత వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్‌సిపికి దూరంగా ఉంటున్న తనను టిడిపిలోకి ఆహ్వానించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం‌లో నారా లోకేశ్ పాదయాత్ర‌కు తనను ఆహ్వానించడం సంతోషంగా ఉందన్నారు. నెల్లూరు పార్లమెంటరీ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ సూచనలతో లోకేశ్ పాదయాత్రను విజయవంతం చేస్తామని కోటంరెడ్డి చెప్పారు.

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రను నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో విజయవంతం చేస్తామని ఆయన తెలిపారు. టిడిపి నేతలతో కలిసి పనిచేస్తామని చెప్పారు. వైఎస్‌ఆర్‌సిపి పతనం నెల్లూరు నుంచే మొదలైందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయన అనుచరులను టిడిపిలోకి ఆహ్వానించామని తెలిపారు. నెల్లూరు నుంచి కాకాణి మంత్రి అయ్యాక ఆ పార్టీలో ముగ్గురు ఎమ్మెల్యేలు బయటకు వచ్చారని, తాము మూడు ఎమ్మెల్సీ స్థానాలను గెలిచామని చెప్పారు. 2024లో వచ్చేది టిడిపి ప్రభుత్వమేనని మాజీ మంత్రి నారాయణ ధీమా వ్యక్తం చేశారు. లోకేశ్ పాదయాత్రను విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సహా నెల్లూరు జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు టిడిపిలోకి రావడం శుభపరిణామం అన్నారు.