వైరల్ ఫోటో : రఘువీరారెడ్డిని స్తంభానికి కట్టేసారు

ఏపీసీసీ మాజీ అధ్య‌క్షుడు ర‌ఘువీరారెడ్డిని తాళ్లతో స్తంభానికి కట్టేసి ఉన్న పిక్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ప్రస్తుతం రఘువీరా రాజకీయాలు మానేసి స్వగ్రామంలోనే ఉంటున్నారు. ఆయన పూర్తిగా పల్లె వాతావరణానికి అలవాటు పడ్డారు. సేద్యం, పశువుల పెంపకంతో రఘువీరారెడ్డి కాలక్షేపం చేస్తున్నారు. దాదాపు మూడేళ్లుగా అనంతపురం జిల్లాలోని నీలకంఠాపురంలోనే ఆయన నివాసం ఉంటున్నారు.

కుమార్తె, కుమారులకు తన వ్యాపారాలను అప్పగించేసి పూర్తిగా పల్లె గాలిని పీల్చుకుంటున్నారు. అయితే రాజకీయాలకు దూరమైనప్పటికీ.. రఘువీరా ఇతర కార్యక్రమాల కోసం తన సమయం వెచ్చిస్తున్నారు. దీంతో తనతో ఆడుకోవడం లేదనే కారణంతో రఘువీరా మనవరాలు ఆయన్ను తాడుతో స్తంభానికి కట్టేసింది. ఈ ఫొటోను రఘువీరా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. త‌న‌ను త‌న మ‌న‌వరాలే ఇలా క‌ట్టేసింద‌ని, ఇంట్లో నుంచి వెళ్ల‌కుండా త‌న‌తో ఆడుకోవాల‌ని చెప్పింద‌ని ర‌ఘువీరారెడ్డి తెలిపారు.

వాస్తవానికి గత కొంతకాలంగా రఘువీరా తన మనవరాలితో ఎంతో సరదాగా గడుపుతున్నారు. మనవరాలితో కలిసి సైక్లింగ్‌లో పోటీ పడుతూ.. ఆమె మొక్కలకు నీళ్లు పడుతుంటే సూచనలు ఇస్తూ.. ఆవులను నీటితో కడుగుతుంటే.. మురిసిపోతూ వీడియోలను ఆయన షేర్ చేస్తున్నారు. దసరా పర్వదినం రోజున తన మనవరాలితో కలిసి ఎద్దుల బండిపై వెళ్లిన వీడియోను సైతం రఘువీరా తన అభిమానులతో పంచుకున్నారు. ఇక ఇప్పుడు తనను తాడుతో స్తంభానికి కట్టేసిన పిక్ షేర్ చేసి వార్తల్లో నిలిచారు.