బద్వేల్ లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ విజయం

అంత అనుకున్నట్లే బద్వేల్ ఉప ఎన్నిక లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ విజయం సాధించారు. ఇప్పటి వరకు ఏడు రౌండ్ల ఫలితాలు వెల్లడి అవ్వగా, ఇప్పటికే 60 వేల పైచిలుకుగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రతి రౌండ్‌లోనూ ఇదే దూకుడు కొనసాగుతోంది. తొలి రౌండ్‌లో 9వేల ఓట్ల ఆధిక్యం వచ్చింది.. తొలి రౌండ్‌లో వైసీపీ 10,478, బీజేపీ 1688, కాంగ్రెస్‌కు 580 ఓట్లు లభించాయి. ఇక పోస్టల్ బ్యాలెట్‌లోనూ వైసీపీదే ఆధిక్యం కనిపించింది. 10 రౌండ్లు ముగిసేసరికి వైఎస్సార్‌సీ 85,505 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికారికంగా మరో రౌండ్ ఫలితం వెలువడాల్సి వుంది.
వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య మరణించడంతో కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అధికార పక్షం.. ఆనవాయితీ సెంటిమెంట్ ప్రకారం వైసీపీ బద్వేలు టికెట్ ను డాక్టర్ వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టర్ దాసరి సుధకు కేటాయించింది. అయితే, సంప్రదాయాన్ని గౌరవిస్తూ.. ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం ఈ ఎన్నికలో పాల్గొనడం లేదని ముందుగానే స్పష్టం చేసింది. తొలుత పాల్గొనాలని భావించినా సెంటిమెంట్, ఆనవాయితీని పాటించాలని నిర్ణయం తీసుకొంది. ఏకగ్రీవం అవుతుందనుకున్న బద్వేల్ అసెంబ్లీ ఉపఎన్నిక… BJP పోటీకి దిగడంతో రసవత్తరంగా మారింది. అయినప్పటికీ ఓటర్లు మాత్రం వైసీపీ కే పట్టం కట్టారు.