రాధికా, శరత్‌కుమార్‌లకు ఏడాది జైలు శిక్ష

తమిళ స్టార్ కపుల్ రాధికా, శరత్‌కుమార్‌లకు చెన్నై ప్రత్యేక కోర్టు పెద్ద షాకిచ్చింది. చెక్‌బౌన్స్ కేసులో ఈ స్టార్ జోడీకి ఏడాది జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో తమిళ సినీ వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. మ్యాజిక్ ఫ్రేమ్స్ అనే సంస్థకు రాధికా, శరత్ కుమార్ జంట ఇచ్చిన చెక్ చెల్లదని బ్యాంక్ తేల్చడంతో వారిపై సదరు సంస్థ ఫిర్యాదు చేసింది.

2014లో రేడియన్స్ మీడియా అనే సంస్థ నుండి రాధికా, శరత్ కుమార్‌లు, లిస్టిన్ స్టీఫెన్‌ అనే వ్యక్తితో కలిసి రూ.1.5 కోట్లు అప్పుగా తీసుకున్నారు. దాన్ని చెల్లించే క్రమంలో వారు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని, అందుకే వారిపై లీగల్ యాక్షన్ తీసుకోవాలంటూ ఫిర్యాదు నమోదైంది. దీంతో వారికి ఏడాదిపాటు జైలు శిక్ష విధిస్తున్నట్లు చెన్నై ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. అంతేగాక వారికి రూ.5 కోట్ల జరిమానా కూడా విధించింది.

ఇలా రాధికా, శరత్ కుమార్, లిస్టిన్ స్టీఫెన్‌లకు కోర్టు శిక్ష విధించడంతో, ఈ వార్త కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అటు తమిళ మీడియాలో ఈ వార్తకు సంబంధించి పలు కథనాలు వస్తుండటంతో రాధికా, శరత్‌కుమార్‌లు ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.