కరోనా దెబ్బకు 144 సెక్షన్ విధింపు.. ఎక్కడంటే?

కరోనా వైరస్ కారణంగా యావత్ ప్రపంచం ఎలా అల్లాడిపోయిందో అందరికీ తెలిసిందే. ఈ మహమ్మారి నుండి ఇంకా ప్రజలు పూర్తిగా బయటపడలేదు. దాదాపు ఏడాది కాలంగా ఈ వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తుండటంతో, పలు దేశాల ప్రభుత్వాలు మరోసారి లాక్‌డౌన్ విధించే దిశగా వెళుతున్నాయి. అయితే భారత్‌లో కూడా కరోనా మరింత విజృంభిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

కాగా ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్ మొదలైందని, అందుకే కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూ వస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం భారీ స్థాయిలో నెలకొంది. కాగా ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ విధించి కరోనాను కట్టడి చేసే ప్రయత్నం చేస్తోంది. తాజాగా బెంగుళూరు పట్టణ పరిధిలో ఏప్రిల్ 7 నుండి 144 సెక్షన్ విధిస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

అయితే కర్ణాటకలో ఈరోజు ఏకంగా 6,150 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, బెంగుళూరు సిటీలో 4,266 కేసులు నమోదవడం గమనార్హం. దీంతో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకే బెంగుళూరులో 144 సెక్షన్ విధించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇక కర్ణాటకలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 10.26 లక్షలు దాటిపోగా.. 9,68,762 మంది కోలుకున్నారు. ఇక 45,107 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది.