చంద్రబాబును కలిసిన మంత్రి పువ్వాడ అజయ్

టీడీపీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను , టిఆర్ఎస్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కలిశారు. జూబ్లీహిల్స్‌లో చంద్రబాబు నివాసానికి వెళ్లిన మంత్రి.. ఆగస్టు 20న జరిగే తన కుమారుడి వివాహానికి హాజరు కావాలని చంద్రబాబుకు ఆహ్వాన పత్రిక అందజేశారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో ఆయనకు కాబోయే వియ్యంకుడు దామవరపు శ్రీనివాసరావు, మాధవి దంపతులు, టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్య ఉన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు వారితో ఆప్యాయంగా మాట్లాడి పెళ్లి విశేషాలు పలు విషయాలు మాట్లాడారు.

మంత్రి పువ్వాడ అజయ్ విషయానికి వస్తే.. 2012 లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేశాడు. 2012 నుంచి 2013 ఏప్రిల్‌ వరకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాడు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా వ్యవహరించాడు. 2013 లో కాంగ్రెస్ పార్టీలో చేరి, 2014లో ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుపై 5609 ఓట్ల తేడాతో గెలుపొంది, తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

2016లో టిఆర్ఎస్ పార్టీలో చేరాడు. 2018లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి రెండోసారి ఖమ్మం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు పై 10,991 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. 2019 సెప్టెంబరు 8న ముఖ్యమంత్రి కెసీఆర్ రెండవ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు. రాజకీయాల్లోకి రాకముందు నుంచే కేటీఆర్‌తో సన్నిహిత సంబంధాలు ఉండటం పువ్వాడకు బాగా కలిసొచ్చింది.