పుష్ప నుండి నాల్గో సాంగ్ వచ్చేస్తుంది..అస్సలు తగ్గేదేలే

పుష్ప టీం ఎక్కడ కూడా తగ్గేదేలే అంటున్నారు. రిలీజ్ సమయం దగ్గర పడుతుండడం తో ప్రమోషన్స్ ను ఇంకాస్త స్పీడ్ చేసారు. ఇప్పటికే మూడు సాంగ్స్ విడుదల చేసి అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్లిన యూనిట్..ఇప్పుడు నాల్గో సాంగ్ ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం పుష్ప. ఆర్య, ఆర్య 2 తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ పార్ట్‌ 1.. పుష్ప ది రైజ్ డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ స్పీడ్ చేసారు. ‘ఏ బిడ్డ ఇది నా అడ్డ‌’అంటూ సాగే నాల్గో పాట ను న‌వంబ‌ర్ 19న‌ విడుద‌ల చేయ‌బోతున్నట్లు ప్రకటించారు చిత్ర యూనిట్. ఈ సందర్భంగా ఓ కొత్త పోస్టర్‌ని విడుదల చేసి అభిమానులను ఆకట్టుకున్నారు.

ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ లో గుబురు గ‌డ్డం, పొడ‌వైన జుట్టుతో ఎర్ర‌టి నిలువు బొట్టు పెట్టుకుని సోఫాలో స్టైల్‌గా కూర్చున్నాడు. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ రోల్ ప్లే చేస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు.