పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు వాయిదా

పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ఆదివారానికి వాయిదా పడ్డాయి. శుక్రవారం పునీత్ గుండెపోటు తో కన్నుమూసిన సంగతి తెలిసిందే. పునీత్ మరణ వార్త యావత్ అభిమానులను , సినీ ప్రముఖులను శోక సంద్రంలో పడేసింది. ప్రస్తుతం అబిమానులను సందర్శనార్థం కంఠీరవ స్టేడియం లో ఉంచారు. నిన్నటి నుండి పెద్ద సంఖ్య లో అభిమానులు , సినీ ప్రముఖులు పునీత్ పార్థివ దేహాన్ని చూసేందుకు తరలి వస్తున్నారు.

ముందుగా ఈరోజు పునీత్ అంత్యక్రియలు జరపాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆదివారానికి వాయిదా వేసినట్లు కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై తెలిపారు. పునీత్ భౌతిక కాయానికి నివాళి అర్పించిన బొమ్మై.. శనివారం జరగాల్సిన అంత్యక్రియలను ఆదివారానికి వాయిదా వేశామన్నారు. పునీత్ కూతురు న్యూయార్క్ నుంచి రావాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇక టాలీవుడ్ నుండి ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, నరేశ్, ప్రభుదేవా, శివాజీలు పునీత్‌‌‌కు నివాళి అర్పించారు. పునీత్ పార్థివ దేహాన్ని చూసి బాలయ్య కన్నీళ్లు పెట్టుకున్నారు.