కుక్క దాడిలో మరో ప్రాణం బలైంది

గత కొద్దీ రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీధి కుక్కల దాడులు ఎక్కువైపోతున్నాయి. చిన్న, పెద్ద అనే తేడాలేకుండా కనిపించినవారిపై దాడికి పాల్పడుతున్నాయి. కుక్కల దాడిలో ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రాణాలు పోగా..తాజాగా మరో ప్రాణం బలైంది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పోచంపల్లిలో నెల రోజుల క్రితం 13 సంవత్సరాల అమ్మాయిని ఓ కుక్క కరిచింది. అప్పుడే దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం తల్లిదండ్రులు హైదరాబాద్ కు తీసుకొచ్చారు. కానీ ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ అమ్మాయి చనిపోయింది. కూతురు చనిపోవడంతో ఆమె తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.

వారం రోజుల క్రితం కూడా ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల పరిధిలోని పుటానితండా గ్రామ పంచాయతీలో జరిగింది. పుటానితండా కు చెందిన బానోతు భరత్ (5) ఆదివారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి ఇంటి దగ్గర ఆడుకుంటున్నాడు. ఈ సమయంలో వీధిలో ఉన్న కుక్కలు బాలుడిపై ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన అనంతరం స్థానికులు.. హుటాహుటిన ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో తల్లిదండ్రులు బాలుడిని హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.