అమేథీ నుంచి రాహుల్ తప్పుకోవడం గర్వంగా ఉందిః స్మృతి ఇరానీ

Smriti Irani

న్యూఢిల్లీః కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ తో పాటు, ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీ లోక్ సభ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తున్నారు. తొలుత ఆయన అమేథీ నుంచి పోటీ చేస్తారని భావించినప్పటికీ… చివరకు రాయ్ బరేలీ నుంచి బరిలోకి దిగారు. గత ఎన్నికల్లో అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ ఓడిపోయారు. వయనాడ్ నుంచి ఆయన గెలుపొందారు.

అమేథీ నుంచి రాహుల్ తప్పుకోవడంపై స్మృతి ఇరానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ ను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఆయనకు అంత ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. రాహుల్ అమేథీలో పోటీ చేయకపోవడం తనకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు. ఒక సాధారణ బీజేపీ కార్యకర్త అయిన తాను… గాంధీ కుటుంబాన్ని ప్యాక్ చేసి అమేథీ నుంచి పంపించేశానని చెప్పారు. ఓడిపోతామనే భావనతోనే అమేథీ నుంచి గాంధీ కుటుంబం తప్పుకుందనేది తన అభిప్రాయమని అన్నారు. ఉత్తరప్రదేశ్ లోని 80 లోక్ సభ స్థానాల్లో 79వ సీటును కూడా కాంగ్రెస్ కోల్పోయిందని చెప్పారు. యూపీలో బీజేపీ క్లీన్ స్వీప్ చేయబోతోందని స్మృతి ధీమా వ్యక్తం చేశారు.

2019లో యూపీలో కాంగ్రెస్ కేవలం ఒక ఎంపీ సీటును మాత్రమే గెలుచుకుంది. ఆ స్థానం నుంచి సోనియాగాంధీ గెలుపొందారు. అనారోగ్య కారణాలతో సోనియా తొలిసారి ప్రత్యక్ష ఎన్నికలకు దూరమయ్యారు. ఇటీవలే ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆమె స్థానంలో ఇప్పుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. అమేథీ నుంచి గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన కిశోరీ లాల్ శర్మ బరిలోకి దిగారు.