ఫిలిం నగర్ లో ఉద్రిక్త వాతావరణం

హైదరాబాద్ ఫిలిం నగర్ లోని హనుమాన్ ఆలయ సమీపంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. గుట్టపై ఉన్న హనుమాన్ విగ్రహాన్ని అధికారులు తొలగించారు. తొలగించిన విగ్రహాన్ని గుట్ట కింద ప్రతిష్టించారు. దీంతో పెద్ద ఎత్తున హిందూ సంఘాలు, స్వాములు ఫిలింనగర్ కు చేరుకొని నిరసనలు తెలుపుతున్నారు. గుట్ట పైనుంచి తొలగించిన ఆంజనేయుడి విగ్రహాన్ని తిరిగి అక్కడే ప్రతిష్టించాలని డిమాండ్​ చేసారు. ఈ క్రమంలోనే హిందూ సంఘాల కార్యకర్తలు.. ఆలయంలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే పోలీసులకు, హిందూ సంఘాలకు మధ్య తోపులాట జరిగింది. పోలీసుల సమక్షంలో ఓ యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.

ఈ క్రమంలోనే 150 మంది హిందూ సంఘాల కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్​ చేసిన వారిని బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్ పోలీస్​స్టేషన్‌లకు తరలించారు. ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్లిన తమను అక్రమంగా అరెస్ట్ చేశారని తెలంగాణ రాష్ట్ర కన్వీనర్‌ సుభాశ్​చందర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుట్టపై అనేక సంవత్సరాలుగా ఉన్న హనుమాన్ విగ్రహాన్ని తొలగించడం బాధాకరమని అన్నారు. ఇదివరకు హనుమాన్ విగ్రహం ఉన్నచోటే మందిరాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్దఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.