ప్రముఖ టాలీవుడ్ నిర్మాత మృతి

టాలీవుడ్ లో శనివారం రెండు విషాదాలు చోటుచేసుకున్నాయి. అనారోగ్యం కారణంగా సీనియర్ నటుడు చంద్రమోహన్ తుది శ్వాస విడిచారు. ఈయన మరణ వార్త చిత్రసీమ ను షాక్ కు గురి చేసింది. టాలీవుడ్ ప్రముఖులంతా ఆయనను కడసారి చూసేందుకు తరలివచ్చారు. రేపు సోమవారం చంద్రమోహన్ అంత్యక్రియలు జరగనున్నాయి.

ఇదిలా ఉండగానే చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది. శ్రావ్య ఫిలిమ్స్ వ్యవస్థాపక నిర్మాత యక్కలి రవీంద్ర బాబు ఆరోగ్య సమస్య తో శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆరోగ్య సమస్యతో హైదరాబాద్ సిటీలో ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన… చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

ఆయనకు భార్య రమా దేవి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వృత్తిరీత్యా రవీంద్ర బాబు చార్టెడ్ ఇంజనీర్. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో గల మార్కాపురం. సొంత ఊరిలో పదో తరగతి వరకు చదివిన ఆయన… ఉన్నత చదువులకు వేరే ఊరు వెళ్లారు. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత చార్టర్డ్ ఇంజనీర్ ఉద్యోగం చేశారు. సినిమాలపై ఇష్టంతో నిర్మాతగా పరిశ్రమలో అడుగు పెట్టారు. శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు ప్రొడ్యూస్ చేశారు యక్కలి రవీంద్ర బాబు. నిర్మాతగా ఈ ప్రయాణంలో 17కు పైగా సినిమాలు తీశారు. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో రవీంద్ర బాబు ఎక్కువ సినిమాలు చేశారు.