కేటీఆర్ కు లక్ష చెక్కును అందజేసిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ

బిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ కు లక్ష చెక్కును అందజేసింది శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ. మలిదశ ఉద్యమంలో శ్రీకాంతాచారి అమరుడైన సంగతి తెలిసిందే. ఆనాటి నుండి శ్రీకాంతాచారి పేరు నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణ లో ఎన్నికల హోరు నడుస్తున్న సంగతి తెలిసిందే. నవంబర్ 30 న పోలింగ్ జరగబోతుంది. ఈ క్రమంలో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారంలో బిజీ గా ఉన్నాయి.

ఈ తరుణంలో ఎన్నికల ఖర్చు కోసం మంత్రి కేటీఆర్ కు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ లక్ష రూపాయిల చెక్కును అందజేసింది. శనివారం నాడు హైదరాబాద్‌ లో మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి.. కేటీఆర్‌ను కలిశారామె. బిఆర్ఎస్ ఎన్నికల ప్రచార ఖర్చులకోసం తన వంతుగా రూ. లక్ష చెక్కును పార్టీకి అందించారు శంకరమ్మ. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్.. మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత శంకరమ్మను మరింత గౌరవప్రదమైన స్థానంలో నిలిపే బాధ్యతను తాను స్వయంగా తీసుకుంటానని తెలియజేశారు.

తెలంగాణ కోసం త్యాగం చేసిన అమరవీరుల ఆశయాల సాధన కోసం మరోసారి బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆ దిశగా కృషి చేయాలని శంకరమ్మకు దిశానిర్దేశం చేశారు కేటీఆర్. కాగా, ఎన్నికల్లో మూడోసారి బీఆర్ఎస్ పార్టీ గెలిచి హ్యాట్రిక్ సీఎం గా కేసీఆర్ నిలవాలని ఆకాంక్షించారు శంకరమ్మ.