శ్రీకాకుళం జిల్లాలో ప్రమాదానికి గురైన స్కూల్ బస్సు..

స్కూల్స్ ప్రారంభం అయ్యాయో..లేవో అప్పుడే ఓ స్కూల్ బస్సు ప్రమాదానికి గురైన సంఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. బుధువారం ఉదయం ఎంతో ఉత్సాహంతో స్కూల్స్ కు బయలుదేరిన విద్యార్థులు.. ఒక్కసారిగా ప్రమాదం బారిన పడటంతో తల్లిదండ్రులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది.

సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామ సమీపంలో ప్రైవేటు స్కూల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. సరుబుజ్జిలి మండలం మండలం రొట్టవలస గ్రామంలో కేరళ ప్రైవేట్ స్కూల్ నిర్వహిస్తోంది. ఈరోజు ఉదయం పిల్లలతో స్కూల్‌కు బయలుదేరిన బస్సు ప్రమాదశాత్తు బోల్తాపడింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 15 మంది విద్యార్ధులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఐదుగురు చిన్నారులతో పాటు డ్రైవర్, క్లీనర్‌కు స్వల్పగాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని స్థానికంగా ఉన్న జొన్నవలస పీహెచ్‌సీకి తరలించారు. ప్రమాదంలో పిల్లలు క్షేమంగా బయటపడటంతో తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు.