అమెరికా పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోడీ

న్యూయార్క్, వాషింగ్టన్‌లో పర్యటిస్తానని, అధ్యక్షుడు బైడెన్‌తో సమావేశం అవుతానని వెల్లడి

Prime Minister Narendra Modi leaves for America

న్యూఢిల్లీః ప్రధాని మోడీ ఈరోజు ఉదయం ఢిల్లీ నుంచి విమానంలో అమెరికా పర్యటనకు బయలుదేరారు. ప్రయాణం ప్రారంభించే ముందు ఆయన తన పర్యటనకు సంబంధించిన వివరాలను ట్వీట్ చేశారు. మోడీ న్యూయార్క్, వాషింగ్టన్ నగరాల్లో పర్యటించనున్నారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగే యోగా దినోత్సవంలో కూడా పాల్గొంటారు. పలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై చర్చించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో సమావేశమవుతారు. అమెరికా ఉభయసభలను ఉద్దేశించి మోడీ ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా అమెరికాలోని భారత సంతతి వ్యాపారవేత్తలు, రాజకీయనాయకులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో కూడా ప్రధాని మోడీ సమావేశమవుతారు.

భారత ప్రధాని మోడీకి ఇది తొలి అధికారిక పర్యటన కావడంతో దీనికి అత్యధిక ప్రాధాన్యం ఏర్పడింది. రక్షణ, టెక్నాలజీ రంగాల్లో ఇరు దేశాలను మరింత దగ్గర చేసేందుకు మోదీ పర్యటన దోహదపడుతుందని పరిశీలకులు చెబుతున్నారు. ఇరు దేశాల దౌత్య సంబంధాలకు ఈ పర్యటన ఓ కీలక మలుపని వ్యాఖ్యానిస్తున్నారు. రక్షణ రంగంలో ఇరు దేశాల కంపెనీల మధ్య భాగస్వామ్యం కోసం విధివిధానాలను ఈ పర్యటనలో ఆవిష్కరించనున్నారు.