జులై 4న హైదరాబాద్​లో రాష్ట్రపతి పర్యటన

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మరోసారి హైదరాబాద్ లో పర్యటించబోతున్నారు. గతంలో దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్యాడ్రుయేడ్స్ పరేడ్​లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి నగరంలో అడుగుపెట్టబోతున్నారు. జులై 4న రాష్ట్రపతి ముర్ము నగరంలో పర్యటిస్తారు. ఈ పర్యటన సందర్భంగా ఏర్పాట్లను చేపట్టాలని సీఎస్‌ శాంతి కుమారి ఆదేశించారు.

అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్రప‌తి ద్రౌపది ముర్ము ఈ నెల 4న హైదరాబాద్ వస్తున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో చేయాల్సిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమవారం ఉన్నతస్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని శాఖల సమన్వయంతో ప్రోటోకాల్ ప్రకారం విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు.

ఈ మార్గంలో రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి. బారికేడ్లు, తగిన బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. పారిశుధ్యం, పరిశుభ్రత పాటించాలన్నారు. పర్యటన సందర్భంగా నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా చూడాలని విద్యుత్ శాఖను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్య బృందాన్ని సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.

డీజీపీ అంజనీకుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సునీల్ శర్మ, అర్వింద్ కుమార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి, హైదరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, కార్యదర్శి జీఏడీ శేషాద్రి, ఆర్ అండ్ బీ కార్యదర్శి శ్రీనివాస్ రాజు, జీహెచ్ ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు.