ఓటు వేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

President Droupadi Murmu Casts Her Vote At Polling Booth In Delhi

న్యూఢిల్లీః లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈరోజు ఆరో విడత పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగనుంది. దీంతో ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు పోటెత్తుతున్నారు. సామాన్య ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు సైతం ఓటేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓటేశారు. ఢిల్లీలోని ఓ పోలింగ్‌ కేంద్రానికి వెళ్లిన రాష్ట్రపతి అక్కడ తన అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్‌ ప్రక్రియలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

మరోవైపు భారత జట్టు మాజీ క్రికెటర్‌, ఈస్ట్‌ ఢిల్లీ సిట్టింగ్‌ ఎంపీ గౌతమ్‌ గంబీర్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆరో దశ లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఇవాళ ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరుగుతున్నది. ఓటు వేసిన అనంతరం గంబీర్‌ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఓటు హక్కు అనేది ప్రజల శక్తి అని ఆయన పేర్కొన్నారు. గత పదేళ్ల బీజేపీ పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని గంబీర్‌ చెప్పారు. కాగా సిట్టింగ్‌ ఎంపీ అయిన గంబీర్‌ ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి నిరాకరించారు.