మునుగోడు ఓటరు జాబితాపై హైకోర్టులో విచారణ వాయిదా

మునుగోడు లో ఓట్ల నమోదుకు సంబంధించి హైకోర్టులో బిజెపి రిట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై ఈరోజు హైకోర్టు విచారించింది. ఓటర్ల జాబితా ప్రకటించకుండా దీనిపై ఆదేశాలు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. జాబితా ప్రకటించాక అభ్యంతరాలు ఉంటే తెలుపవచ్చని హైకోర్టు పేర్కొంది. ఓటర్ల జాబితాపై తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది.

మునుగోడులో కొత్తగా 25 వేల దరఖాస్తులు వచ్చాయని బిజెపి అభ్యంతరాలు తెలిపింది. అయితే మునుగోడులో ఓటర్లు అసాధారణంగా పెరిగినట్లు కనిపించడం లేదని హైకోర్టు పేర్కొంది. మునుగోడులో 2018, అక్టోబర్ 12 నాటికి 2,14,847 మంది ఓటర్లు ఉన్నట్లు వివరించారు. అలాగే ఈ నెల 11 నాటికి 2, 38,759 మంది ఉన్నారని చెప్పారు. కొత్తగా 25,013 మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.