జూన్ 9 వరకు గ్రూప్-1 ఎగ్జామ్‌ను వాయిదా వేయండిః ప్రవీణ్ కుమార్‌

Postpone Group-1 Exam till June 9: Praveen Kumar

హైదరాబాద్ః టీఎస్‌పీఎస్‌సీ నిర్వ‌హించే గ్రూప్‌-1 ప‌రీక్ష వాయిదా వేయాల‌ని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ డిమాండ్ చేశారు. జూన్ 9వ తారీఖున‌ జరగబోయే గ్రూప్-1 ఎగ్జామ్‌ను కనీసం ఒక నెల అయినా వాయిదా వేస్తే బాగుంటుందని తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా టీఎస్‌పీఎస్‌సీకి విజ్ఞ‌ప్తి చేశారు.

ఎందుకంటే అదే రోజు కేంద్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) ఇన్‌స్పెక్టర్ ఎగ్జామ్ కూడా ఉంది. దానికి చాలా మంది తెలంగాణ నిరుద్యోగులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నార‌న్నారు. అలాగే చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు (రెవెన్యూ, పోలీసు) గత నాలుగు నెలల నుండి ఎన్నికల నిర్వహణలో తలమునకలైనందు వల్ల వాళ్లకు బాగా ప్రిపేర్ అయ్యే అవకాశం దొర‌క‌లేదు. కాబట్టి వాళ్లకు ఒక నెలైనా స‌మ‌యం ఇస్తే.. కనీసం లాస్ ఆఫ్ పే సెలవు మీద చదువుకుని పరీక్షకు హాజ‌ర‌వుతార‌ని తెలిపారు.

ఈ విషయంలో సాధ్యాసాధ్యాలు పరిశీలించి గత ఎనిమిదేళ్లుగా గ్రూప్-1 కోసం ఎదురుచూస్తున్న అందరు నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకోవాలని బోర్డును కోరారు. అలాగే అన్ని జాగ్రత్తలు తీసుకొని పరీక్షను పకడ్భందీగా నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ త‌రుఫున ఆయ‌న అభ్యర్థించారు. అదే విధంగా ఏఈఈ పరీక్ష రాసిన అభ్యర్థులు ఎంతో కాలంగా నియామక పత్రాల కోసం ఎదురుచూస్తున్నార‌ని, వారికి వెంటనే న్యాయం చేయాల‌ని ప్ర‌వీణ్ కుమార్ కోరారు.