ఎట్టకేలకు కొవాగ్జిన్‌కు అనుమతి లభించింది

హైద‌రాబాద్‌కు చెందిన భార‌త్ బ‌యోటెక్ కంపెనీ అభివృద్ధి చేసిన కొవిడ్ టీకా కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌కు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (WHO) గుర్తింపు ద‌క్కింది. దీంతో భార‌త్ లో మాత్ర‌మే కాకుండా ఇత‌ర దేశాల్లోనూ కొవాగ్జిన్ టీకా అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమ‌తి ల‌భించింది. కొవాగ్జిన్ వ్యాక్సిన్ అన్ని విధాలుగా ప‌రీక్షించిన‌ ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ టెక్నిక‌ల్ అడ్వైజ‌రీ క‌మిటీ.. ఏ లోపాలు లేక‌పోవ‌డంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్య‌వ‌స‌ర వినియోగానికి ఆమోదం తెలిపింది.

కొవాగ్జిన్ టీకాను అన్ని విధాలుగా ప‌రీక్షించిన‌ WHO టెక్నిక‌ల్ అడ్వైజ‌రీ క‌మిటీ.. ఏ లోపాలు లేక‌పోవ‌డంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్య‌వ‌స‌ర వినియోగానికి ఆమోదం తెలిపింది. భార‌త్‌లో గ‌త కొన్ని నెల‌లుగా 18 ఏండ్లు పైబ‌డిన వారికి కొవాగ్జిన్ టీకా ఇస్తున్నారు. WHOకు చెందిన టెక్నిక‌ల్ అడ్వ‌యిజ‌రీ క‌మిటీ కొవాగ్జిన్‌కు అనుమతి ఇచ్చే విష‌య‌మై గ‌తంలోనే అక్టోబ‌ర్ 26న‌ స‌మావేశ‌మైంది. ఆ స‌మావేశంలో టీకాకు సంబంధించి భార‌త్ బ‌యోటెక్ ఇచ్చిన స‌మాచారాన్ని ప‌రిశీలించి అదనపు సమాచారం కావాలని కోరింది. భార‌త్ బ‌యోటెక్ సంబంధిత సమాచారం అంద‌జేయ‌డంతో ఇవాళ మ‌రోసారి భేటీ అయ్యింది. టీకా త‌యారీదారు ఇచ్చిన స‌మాచారంతో సంతృప్తి చెంది ఆమోదం తెలిపింది.