మోడీ గారూ.. ఫ్లైఓవర్‌ ఇంకా ఎన్నేళ్లు కడతారు? అంటూ నగరంలో పోస్టర్లు కలకలం

మరోసారి కేంద్రానికి వ్యతిరేకంగా హైదరాబాద్ లో పోస్టర్లు వెలిసాయి. ఉప్పల్‌ – నారపల్లి ఫ్లైఓవర్‌ నిర్మాణంలో కేంద్రం ఆలస్యం ఫై ప్రజలు నిరసన తెలుపుతూ ఈ పోస్టర్లు అతికించారు. భారత్‌మాల ప్రాజెక్టు కింద ఉప్పల -నారపల్లి ఫ్లైఓవర్‌ను కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్నది.

అయితే ఐదేండ్లు అయినా ఈ ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. ఇప్పటివరకు 40 శాతం వర్క్‌ కూడా పూర్తి కాలేదు. ఫ్లైఓవర్‌ను వీలైనంత తొందరగా పూర్తి చేయాలని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డికి విన్నవించుకున్నా స్పందన కరవైంది. దీంతో ప్రజలు కేంద్రం ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టర్లు అంటించారు.

రెండు రోజుల క్రితం ఉప్పల్‌ – నారపల్లి ఫ్లైఓవర్‌ గురించి ఓ నెటిజన్ కేటీఆర్ ను ట్విట్టర్ ద్వారా ప్రశ్నించిన సంగతి తెలిసిందే. దీనికి కేటీఆర్..ఉప్ప‌ల్, అంబ‌ర్‌పేట ఫ్లై ఓవ‌ర్ల ప‌నులు దుర‌దృష్టావ‌శాత్తు నేష‌న‌ల్ హైవేస్ ఆధ్వ‌ర్యంలో కొన‌సాగుతున్నాయి. ఈ రెండు ఫ్లై ఓవ‌ర్ల‌కు జీహెచ్ఎంసీ భూములు కేటాయించిన‌ప్ప‌టికీ ప‌నులు న‌త్త‌న‌డ‌కన కొన‌సాగుతున్నాయ‌ని కేటీఆర్ పేర్కొన్నారు. కానీ రాష్ట్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో, జీహెచ్ఎంసీ ద్వారా ఎస్ఆర్డీపీ కింద 35 ప్రాజెక్టులు చేప‌ట్టి.. అనతి కాలంలోనే అన్ని ప్రాజెక్టులు పూర్తి చేశామ‌న్నారు. కానీ కేంద్రం చేప‌ట్టిన రెండు ప‌నులు మాత్రం పూర్తి కావ‌డం లేద‌ని విమ‌ర్శించారు. కేసీఆర్ ప్ర‌భుత్వానికి, మోడీ ప్ర‌భుత్వానికి ఉన్న తేడా ఇదేన‌ని కేటీఆర్ పేర్కొన్నారు.