రేపు బాపట్ల జిల్లాలో పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర‌

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు బాపట్ల జిల్లా పర్చూరులో కౌలు రైతు భరోసా యాత్ర‌ నిర్వహించబోతున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టిన సంగతి తెలసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులను గుర్తించి వారి కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్ధిక సాయం అందిస్తున్నారు. ఇందుకోసం ఆయన తన సొంత డబ్బును వినియోగిస్తున్నారు. ఇప్పటికే అనంపురం, పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాల్లో పర్యటించిన ఆయన.. ప్రకాశం జిల్లాలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. రీసెంట్ గా పవన్ కు తన కుటుంబం అండగా నిలిచింది. మేనల్లుళ్లు, అన్నయ్య బిడ్డలు అండగా నిలిచారు. సాగు నష్టాలు, ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణాలకు పాల్పడ్డ కౌలు రైతు కుటుంబాలకు అండగా ఉండాలనే సదుద్దేశంతో పెద్ద మనస్సు చేసుకుని రూ.35 లక్షల విరాళం అందించారు.

ఇక రేపు బాపట్ల జిల్లా పర్చూరులో కౌలు రైతు భరోసా యాత్ర‌ నిర్వహిస్తున్నారు. చిలకలూరిపేట, జాగర్లమూడి, యద్దనపూడి మీదుగా పవన్ పర్చూరుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎస్కేపీఆర్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడనున్నారు. ఇక వైస్సార్సీపీ పాలనలో 3 వేల మంది రైతుల ఆత్మహత్య చేసుకున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ మండిపడ్డారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం ఇవ్వట్లేదన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడ్డ 80 మంది కౌలురైతుల కుటుంబాలకు రేపు పవన్ ఆర్థిక సాయం అందిస్తారని మనోహర్ తెలిపారు.