పవన్ కు విగ్రహం కట్టించి పాలాభిషేకం చేస్తా – పోసాని

సినీ నటుడు , ఏపీఎఫ్‌డీసీ చైర్మన్ పోసాని కృష్ణ మురళి మరోసారి పవన్ కళ్యాణ్ ఫై పలు వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. అప్పుడెప్పుడో హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో పవన్ కళ్యాణ్ ఫై ఆయన ఫ్యామిలీ ఫై పలు వ్యాఖ్యలు చేసి అభిమానుల్లో తీవ్ర ఆగ్రహం నింపిన పోసాని..ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఫై స్పందించకుండా సైలెంట్ గా ఉన్నారు. ఇక ఇప్పుడు తాజాగా జగన్ సర్కార్ పోసాని కి ఏపీఎఫ్‌డీసీ చైర్మన్ పదవి కట్టబెట్టిందో లేదో మరోసారి పవన్ కళ్యాణ్ ఫై పోసాని కీలక వ్యాఖ్యలు చేశారు.

పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తే అందరూ గౌరవించే వారని.. ఆయన్ను ఘోరంగా డ్యామేజ్ చేస్తున్నా సరే చంద్రబాబును నమ్ముతున్నారని పోసాని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ చంద్రబాబు ఎంతటి మోసగాడో పవన్ కళ్యాణ్‌కు తెలుసు. రాజకీయాల్లో నైతికత అవసరం లేదు.. సామర్థ్యం చాలు అనుకునే మనిషిని నమ్మావు. మీ అన్నయ్యను ఇబ్బంది పెట్టిన చంద్రబాబు దగ్గరకు ఏ ధైర్యంతో చేరావు..? నేను ప్రజారాజ్యం పార్టీ తరఫున చిలకలూరిపేట నుంచి పోటీ చేశాను. కానీ ఎన్నికల కోసం రూ.7 లక్షలే ఖర్చు పెట్టాను. నేను ప్రచారానికి వెళ్తే కాపుల పార్టీలో చేరావు కాబట్టి ఓటేయనని ఒకావిడ నాతో చెప్పింది. కాపులు మన కమ్మోళ్లను చంపేస్తారట కదా అనింది. కానీ టీ పెట్టించమని అడిగితే టీ పెట్టించింది. ఆ రకంగా నన్ను, ప్రజారాజ్యం పార్టీని ఓడించారు’ అని పోసాని చెప్పుకొచ్చారు.

‘ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నా.. పవన్ కళ్యాణ్‌ను ఘోరంగా డ్యామేజ్ చేస్తున్నా ఆయన తెలుసుకోలేకపోతున్నారు. అది దురదృష్టం. నాకు ఇప్పటికీ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. వాళ్లు నాకెప్పుడూ ద్రోహం చేయలేదు. నా పట్ల వాళ్ల కుటుంబం మొత్తం బాగుంటుంది. చిరంజీవి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. నాకు ఆ గ్రాట్యూటీ ఉంది. లుచ్చా రాజకీయాల కోసం తొందపడి నన్ను అనడాన్ని క్షమార్హం కాదు’’ అని పోసాని అన్నారు.

ఇక రంగా చనిపోవడానికి చంద్రబాబు కారణం కాదా..? కోడెల శివప్రసాద్ కారణం కాదా? రంగా చనిపోవడానికి చంద్రబాబు కారణమని నా లాంటోడికి కూడా తెలుసు.. ఆ విషయం మీకు కూడా తెలుసు. రంగా హత్య తర్వాత గొడవలు జరిగి.. మా కమ్మవాళ్లు చస్తుంటేనే చంద్రబాబు మా దగ్గరకు రాలేదు. అలాంటిది నీకు ఎందుకు అండగా ఉంటాడు. నీ అండతో ఆయన సీఎం అవుతాడు.. తర్వాత ఆయన కొడుకు ముఖ్యమంత్రి అవుతాడు. చంద్రబాబు ఒకవేళ పవన్ కళ్యాణ్‌ను సీఎం చేస్తే.. నేను పవన్ కాళ్లకు పాలాభిషేకం చేసి.. ఆంధ్రాలో 50 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని నా డబ్బులతో కట్టిస్తా. చంద్రబాబు విషయంలో నేను తొందరపడ్డానని, అంచనా తప్పిందని ఒప్పుకుంటా. కానీ పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబు సీఎం చేసే ఛాన్స్ లేద’’న్నారు పోసాని.