ఎన్నికల కోడ్ ఉన్న టైములో రాజకీయ పార్టీలు చేయకూడని పనులు

దేశ వ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల తాలూకా నగారా మోగింది. మధ్య ప్రదేశ్ లో నవంబర్ 17 న , రాజస్థాన్ నవంబర్ 23 న , ఛత్తీస్‌గఢ్‌ లో నవంబర్ 07 , 17 న రెండు దశల్లో , మిజోరం లో నవంబర్ 07 న ,
తెలంగాణ నవంబర్ 30 న ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో నిన్నటి నుండి ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.

ఇక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న టైములో రాజకీయ పార్టీలు చేయకూడని పనులు ఇవి.

ఈ కోడ్‌లో రాజకీయ పార్టీలు ఏం చేయకూడదో చూద్దాం.

  • ప్రభుత్వ సొమ్ముతో పార్టీ కానీ, పార్టీ నేత కానీ తమ ఇంటి వద్ద కార్యక్రమాలు నిర్వహించకూడదు. అయితే, తమ సొంత ఖర్చుతో మాత్రం చేసుకోవచ్చు.
  • ఏదైనా పథకం కానీ, ప్రాజెక్టుకు కానీ కోడ్ అమల్లోకి రావడానికి ముందే గ్రీన్ సిగ్నల్ లభించి, క్షేత్రస్థాయిలో పని ప్రారంభం కాకపోతే, కోడ్ అమల్లోకి వచ్చాక ఆ పని ప్రారంభించడానికి వీల్లేదు.
  • ఎన్నికలతో సంబంధం ఉన్న ఏ అధికార పార్టీ నేతలను కానీ, మంత్రులను కానీ వారి ఇంటి వద్ద వ్యక్తిగతంగా కలవకూడదు.
  • అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వ ధనంతో ప్రకటనలు ఇవ్వకూడదు.
  • కోడ్ అమల్లోకి వచ్చాక పెన్షన్ ఫాంలు స్వీకరించడం, కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం, బీపీఎల్ కుటుంబాలు ఎల్లో కార్డులు జారీ చేయడం నిషేధం.
  • ఎమ్మెల్యే కానీ, ఎంపీలు కానీ తమ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయకూడదు.
  • టెండర్లు జారీ చేయడం కానీ, కొత్త పనులు ప్రారంభించడం కానీ ప్రభుత్వం చేయకూడదు.
  • కోడ్ అమల్లో ఉండగా కొత్త పనులు ప్రారంభించడం, పెద్ద భవనాలకు క్లియరెన్స్ ఇవ్వడం నిషేదం.
  • ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆయుధ లైసెన్స్ ఇవ్వకూడదు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు తీసుకుంటుంది.