మోడీ మంత్రివర్గంలో తెలుగు ఎంపీలకు కేటాయించిన శాఖలు

కేంద్ర మంత్రిమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన నేపథ్యంలో, కేంద్ర మంత్రులకు శాఖలను కేటాయిస్తూ బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుండి ఐదుగురికి మంత్రి పదవులు అందించగా..వారికి కీలక శాఖలను కేటాయించారు. కింజరాపు రామ్మోహన్‌ నాయుడికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, పెమ్మసాని చంద్రశేఖర్​కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్లు (సహాయమంత్రి), భూపతిరాజు శ్రీనివాస వర్మకు భారీ పరిశ్రమలు, ఉక్కు (సహాయ మంత్రి) శాఖ, కిషన్​రెడ్డికి బొగ్గు గనులశాఖను, బండి సంజయ్​కు హోంశాఖ సహాయ మంత్రిగా పదవులు అప్పగించింది.

ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే ఢిల్లీ లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌లోని తన నివాసంలో, మంత్రివర్గ సమావేశం నిర్వహించిన ప్రధాని మోదీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అర్హులైన వారి కోసం, మొత్తం 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి ఆర్థికసాయం అందించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. గత పదేళ్లలో ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద 4కోట్ల 21లక్షల ఇళ్ల నిర్మాణం జరిగింది. వాటికి ప్రాథమిక మౌలిక వసతులు కల్పించినట్లు అధికారులు తెలిపారు.