ధనుష్ ‘సార్’ టీజర్ వచ్చేసింది

ధనుష్ నటిస్తున్న ‘సార్’ టీజర్ వచ్చేసింది. ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం‌ ‘సార్‌’ (తెలుగు)/ ‘వాతి’ (తమిళం). వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ధనుష్ సరసన సంయుక్త మీనన్ నటిస్తోంది. ఈరోజు( జులై 28 ) ధనుష్ పుట్టిన రోజు సందర్భంగా మూవీ మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేసింది.

మన దేశంలోని విద్యావ్యవస్థలోని లోపాలను ప్రశ్నించే కథాంశంతో ”సార్” చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు టీజర్ చూస్తే అర్థం అవుతుంది. ధనుష్ విభిన్నమైన లుక్స్ లో కనిపించడాన్ని బట్టి చూస్తే.. ఈ కథ అతని జీవితంలోని వివిధ దశలను చూపుతుందని అర్థం అవుతోంది. అంతేకాదు అతను రెండు పాత్రల్లో కనిపిస్తారనే సందేహాలను కలిగిస్తోంది.

‘విద్య అనేది గుడిలో దేవుడికి పెట్టే నైవేద్యంతో సమానం సార్.. పంచండి.. ఫైవ్ స్టార్ హోటల్ లో డిష్ లాగా అమ్మకండి’ అని ధనుష్ చెప్పే డైలాగ్ బాగుంది. కాకపోతే ధనుష్ తెలుగు డబ్బింగ్ మాత్రం డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఇకపోతే ధనుష్ శైలి కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటుగా మంచి సందేశం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫై యువ నిర్మాత నాగవంశి నిర్మిస్తున్న ‘సార్’ సినిమా షూటింగ్ దాదాపు తుది దశకు చేరుకుంటుంది. తొలిప్రేమ, మిస్టర్ మజ్ను చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండటం తో అంచనాలు భారీగా ఉన్నాయి.