రాజకీయాలకు గుడ్ బై చెప్పిన మాజీ ఎంపీ కేశినేని నాని

విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు గుడ్ చెపుతున్నట్లు ప్రకటించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా విజయవాడ స్థానం నుంచి సొంత తమ్ముడి కేశినేని చిన్ని చేతిలో ఓడిపోయారు నాని. ఈ క్రమంలో నాని రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

‘‘ నా రాజకీయ ప్రయాణాన్ని ముగించాను. రెండు పర్యాయాలు పార్లమెంటు సభ్యుడిగా విజయవాడ ప్రజలకు సేవ చేయడం అపూర్వమైన గౌరవం. విజయవాడ ప్రజల స్థైర్యం, దృఢసంకల్పం నాకు స్ఫూర్తినిచ్చాయి. వారి తిరుగులేని మద్దతుకు నా కృతజ్ఞతలు. నేను రాజకీయ రంగానికి దూరంగా ఉన్నా.. విజయవాడపై నా నిబద్ధత బలంగానే ఉంటుంది. విజయవాడ అభివృద్ధికి నేను చేయగలిగిన విధంగా మద్దతు ఇస్తూనే ఉంటాను. నా రాజకీయ ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. విజయవాడ అభివృద్ధి, శ్రేయస్సు కోసం పాటుపడుతున్న కొత్త ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు’’ అంటూ కేశినేని నాని ప్రకటించారు.

రెండుసార్లు టీడీపీ నుండి విజయం సాధించిన నాని..ఈసారి ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబుతో విబేధాల కారణంగా కొద్ది రోజుల ముందు వైసీపీలో చేరారు. విజయవాడ నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి.. సొంత సోదరుడు కేశినేని చిన్ని చేతిలో ఓడిపోయారు.