షర్మిల చేరిక విషయంపై క్లారిటీ ఇచ్చిన పొంగులేటి

ఇటీవల కాంగ్రెస్ పార్టీ లో చేరిన మాజీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..కాంగ్రెస్ పార్టీ లో షర్మిల చేరిక ఫై స్పందించారు. సోమవారం పొంగులేటి..సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కలిసేందుకు ఆయన నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా పొంగులేటి, భట్టిలు కొద్దిసేపు రాష్ట్ర, ఖమ్మంజిల్లా రాజకీయాలపై చర్చించారు. అనంతరం పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేసారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మా జిల్లా నేత భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలవాలని వచ్చినట్లు తెలిపారు. ఇద్దరి మధ్య రాజకీయాల ప్రస్తావన వచ్చిందని , సీఎం కేసీఆర్ పరిపాలనను బంగాళాఖాతంలో కలపడంపై చర్చించామని అన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు రెండే వర్గాలు ఉన్నాయని, వాటిలో ఒకటి ప్రభుత్వ అనుకూల వర్గం, రెండు వ్యతిరేక వర్గం మాత్రమే అన్నారు. ప్రజలు ఈసారి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని బలంగా డిసైడ్ అయ్యారంటూ ధీమా వ్యక్తం చేసారు.

ఇక షర్మిల చేరికకు సంబంధించి పార్టీలో పెద్దవాళ్ళు ఉన్నారు.. వాళ్లే చూసుకుంటారు అని క్లారిటీ ఇచ్చారు. అలాగే రీసెంట్ గా ఏపీకి వెళ్లి సీఎం జగన్ ను కలిసినట్లు వచ్చిన వార్తలపై కూడా పొంగులేటి స్పందించారు. నేను ఏపీకి వెళ్లిన మాటవాస్తవమే. అయితే, కేవలం సీఎంఓ అధికారులను మాత్రమే కలిశా. జగన్మోహన్ రెడ్డిని మాత్రం నేను కలవలేదు అని అన్నారు. నా సంస్థకు సంబంధించిన కాంట్రాక్ట్ పనులకు సంబంధించిన అంశాలను అధికారులతో చర్చించానని తెలిపారు.