ఏపీలోని ఆ ఆరు జిల్లాలో ఈరోజు భారీ వర్షాలు ..

రెండు తెలుగు రాష్ట్రాల్లో జులై నెలలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం తడిసిముద్దవుతోంది. ప్రతి రోజు పలు చోట్ల భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. దీంతో అన్ని ప్రాజెక్ట్ ల నుండి దిగువకు భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉంటె ఈరోజు ఏపీలోని ఆరు జిల్లాలో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

వైఎస్సార్, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, అనంతపురం, నంద్యాల, కర్నూలు తదితర ఆరు జిల్లాల్లో భారీగా వానలు కురుస్తాయని అంచనా వేసింది వాతావరణ శాఖ. రాష్ట్రవ్యాప్తంగా మిగతా చోట్ల అక్కడక్కడా స్వల్పంగా వానలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షములు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

నిన్న శుక్రవారం హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. ఉత్తర-దక్షిణ ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉదయం నుంచి ఎండ వచ్చినప్పటికీ మధ్యాహ్నం 3 గంటల తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దాదాపు 2 గంటలపాటు ఏకధాటిగా కురిసిన కుంభవృష్టితో హైదరాబాద్‌ అతలాకుతలమైంది. రోడ్లన్నీ జలమయమాయ్యయి. పలుచోట్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి నీరు చేరింది. కీసర, ఇబ్రహీంపట్నం, దండుమైలారం, నేరేడ్‌మెట్‌, మల్కాజిగిరి, ఈస్ట్‌ ఆనంద్‌బాగ్‌, సింగపూర్‌ టౌన్‌షిప్‌ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.