రాజస్థాన్‌లో ప్రారంభమైన పోలింగ్..ఉదయం 9 వరకు 9.77 శాతం ఓటింగ్

మొత్తం 199 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి జరుగుతున్న ఎన్నికలు

polling-begins-for-199-assembly-seats-in-rajasthan

జెపూర్‌ః రాజస్థాన్‌లో ఈ ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 199 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో 1,863 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 వరకూ కొనసాగుతుంది. ఉదయం 9గంటల వరకు 9.77 శాతం పోలింగ్ నమోదైంది. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడించనున్నారు. ఎమ్మెల్యే గుర్‌మీత్ సింగ్ కూనర్ మరణంతో కరణ్‌పూర్ స్థానంలో ఎన్నికలు వాయిదా వేశారు.

కాంగ్రెస్ అధికారం నిలబెట్టుకునేందుకు శ్రమిస్తుండగా బిజెపి అధికార పక్షాన్ని గట్టిదెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సర్దార్‌పుర నుంచి బరిలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ఝల్రాపటన్ నుంచి పోటీలో నిలిచారు. మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ టాంక్ సీటు నుంచి, ప్రతిపక్ష పార్టీ నాయకుడు రాజేంద్ర రాథోడ్ తారానగర్ సీటు నుంచి బరిలో నిలిచారు. రాష్ట్రంలో మొత్తం 51,507 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశామని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ప్రవీణ్ గుప్త తెలిపారు. 26,393 పోలింగ్ బూత్‌లలో లైవ్ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు.