ఢిల్లీ ఉప ఎన్నికల్లో ఆప్‌ అభ్యర్థి దుర్గేష్‌ పాఠక్‌ ఘనవిజయం..

ఢిల్లీ రాజిందర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించింది. ఆప్ అభ్యర్థి దుర్గేశ్ పాఠక్ సమీప బీజేపీ అభ్యర్థి రాజేష్ భాటియాపై 11 వేల ఓట్లకు పైగా ఆధిక్యంతో విజయం సాధించారు. రాజిందర్ నగర్ ఆప్‌ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా రాజీనామా చేసి పంజాబ్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన ఈ స్థానానికి గురువారం ఉప ఎన్నికలు జరిగాయి.

43.75 శాతం ఓటింగ్‌ నమోదు కాగా, సుమారు 72 వేల మంది ఓట్లరు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆదివారం ఓట్ల లెక్కింపు జరుగగా..మొదటి రౌండ్ నుండే ఆప్‌ అభ్యర్థి దుర్గేష్‌ పాఠక్‌ పైచేయి సాధిస్తూ వచ్చారు. మొత్తం 16 రౌండ్ల పాటు కౌంటింగ్ కొనసాగింది. ఆప్ అభ్యర్థి 40,319 ఓట్లను సాధించగా.. బీజేపీ అభ్యర్థి 28,851 ఓట్లను పొందారు. ఉప ఎన్నికలో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్ లతకు రెండు వేల 14 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆప్‌ అభ్యర్థి దుర్గేష్‌ పాఠక్‌ విజయంపై ఆ పార్టీ చీఫ్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ రాజిందర్ నగర్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. చెడ్డ రాజకీయాలను ఓడించి మంచి పనులు చేసిన ఆప్‌కు ప్రజలు మద్దతిచ్చారని అన్నారు.

మరోపక్క త్రిపురలో నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరగగా.. మూడుచోట్ల బీజేపీ విజయఢంకా మోగించింది. కాంగ్రెస్ ఒక చోట నెగ్గింది. త్రిపుర ముఖ్యమంత్రి, బీజేపీ నేత మాణిక్ సాహా బార్డోవాలీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. రాజధాని అగర్తలా అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సుదీప్ రాయ్ బర్మన్ గెలిచారు.