పిన్నెల్లి కోసం పోలీసుల గాలింపు.. అరెస్టుకు ఈసీ ఆదేశాలు

Police search for Pinnelli.. EC orders for arrest

Community-verified icon

అమరావతిః ఏపీలో ఈ నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయ్ గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను, వీవీప్యాట్ యంత్రాన్ని ధ్వంసం చేసిన ఘటనలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. వీడియో ఫుటేజ్ లో పిన్నెల్లి అడ్డంగా దొరికిపోవడంతో కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ ఘటనను సీరియస్ గా తీసుకుని సీఈఓకు నోటీసులు జారీ చేసింది. దీంతో సీఈవో ఆదేశాల మేరకు పిన్నెల్లి అరెస్టుకు పోలీసులు సిద్ధమవుతున్నవారు.

పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం ఘటనపై తీసుకున్న చర్యలను ప్రశ్నిస్తూ సీఈసీ నుంచి సీఈఓకు నోటీసులు అందడంతో ఆయన ఆదేశాల మేరకు ఐపీసీ, ఆర్పీ, ప్రజాప్రాతినిధ్య చట్టాల కింద మొత్తం 10 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పిన్నెల్లిని ఈ కేసులో ఏ1గా చేర్చారు. ఈ సెక్షన్లు నిరూపణ అయితే గరిష్టంగా ఏడేళ్ల వరకూ పిన్నెల్లికి జైలుశిక్ష పడే అవకాశముందని సీఈవో తెలిపారు.

ఐపీసీలోని 143, 147, 448, 427, 353, 452, 120బి సెక్షన్ల కింద పిన్నెల్లిపై కేసులు నమోదు చేసారు. ఆర్పీ చట్టంలోని 131, 135 సెక్షన్ల కింద, అలాగే పీడీపీపీ చట్టం కింద మరో కేసు నమోదు చేసారు. ఈ నెల 20నే కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఆయన కోసం గాలింపు చేపట్టారు. దీంతో ఆయన తెలంగాణకు పరారయ్యారు. నేడు తెలంగాణలోని సంగారెడ్డిలో ఆయన కారును పోలీసులు గుర్తించారు. పట్టుకునేలోపు పిన్నెల్లి పారిపోయారు. దీంతో ఆయన కోసం తీవ్ర గాలింపు సాగుతోందని సీఈవో ప్రకటించారు.

పోలింగ్ రోజు ఏపీలో మొత్తం 9 చోట్ల, ఇందులో ఒక్క మాచర్లలోనే 7 చోట్ల ఈవీఎంలు ధ్వంసం చేశారని ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా తెలిపారు. 10 సెక్షన్ల కింద మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లిపై కేసులు పెట్టామని, ఏడేళ్ల వరకు ఆయనకు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. ఆయన్ను అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాలు వెళ్లాయన్నారరు. ఎవరినీ వదిలే ప్రసక్తి లేదని మీనా వెల్లడించారు. పిన్నెల్లి విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో ఈరోజు సాయంత్రం 5లోపు వివరణ ఇవ్వాలని సీఈఓను ఈసీ ఆదేశించింది.