ఆర్మీ కొత్త చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే బాధ్యతలు

ముగిసిన నరవణే పదవీ కాలం
వైస్ చీఫ్ గా బీఎస్ రాజు

న్యూఢిల్లీ : ఈరోజు ఆర్మీ కొత్త చీఫ్ గా (చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాప్) లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే బాధ్యతలు చేపట్టారు. జనరల్ ఎంఎం నరవణే ఆయనకు బాధ్యతలు అప్పగించారు. దీంతో సైన్యాధ్యక్షుడిగా నరవణే పదవీ కాలం ముగిసినట్టయింది. ఇప్పటి వరకు జనరల్ మనోజ్ పాండే ఆర్మీ ఉప చీఫ్ గా పనిచేశారు. ఎంఎం నరవణే పదవీకాలం ముగియడంతో ఆయనకు పదోన్నతి దక్కింది.

కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ విభాగం నుంచి ఆర్మీ చీఫ్ అయిన తొలి అధికారిగా జనరల్ మనోజ్ పాండే చరిత్ర సృష్టించారు. గతంలో ఈ విభాగం నుంచి వైస్ చీఫ్ స్థానం వరకే రాగలిగారు. 1962 మే 6న జన్మించిన పాండే.. ఆర్మీకి 29వ అధిపతిగా పనిచేయనున్నారు. 62 ఏళ్ల వరకు లేదంటే మూడేళ్లు ఈ రెండింటిలో ఏది ముందే అయితే అప్పుటి వరకు పదవిలో కొనసాగుతారని కేంద్రం ప్రకటించింది.

చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు, ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో ఆర్మీ చీఫ్ గా మనోజ్ పాండే బాధ్యతలు చేపట్టారు. ఆర్మీ వైస్ చీఫ్ పదవిని మే 1న బీఎస్ రాజు చేపట్టనున్నారు. ఆర్మీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ గా ప్రస్తుతం రాజు పనిచేస్తున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/