బిజెపియే బలవంతంగా ఉపఎన్నికను తీసుకొచ్చింది : గుత్తా సుఖేందర్‌ రెడ్డి

gutha sukender reddy
gutha sukender reddy

నల్లగొండః మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి నల్లగొండలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ..బిజెపిపై విమర్శలు గుప్పించారు. బిజెపికి మత పిచ్చి ముదిరిపోయిందని ఆయన అన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి, కులాల మధ్య చిచ్చుపెట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు బిజెపి పాల్పడుతున్నదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వల్ల రూపాయి విలువ పడిపోతున్నదని విమర్శించారు. బిజెపి స్వార్ధంతోనే మునుగోడు ఉపఎన్నిక వచ్చిందన్నారు. కమలం పార్టీయే బలవంతంగా ఉపఎన్నికను తీసుకొచ్చిందని, తద్వారా తన బలాన్ని పరీక్షించుకుంటున్నదని ఆరోపించారు.

కేంద్ర మంత్రులంతా మునుగోడులోనే తిరుగుతున్నారని చెప్పారు. విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయాలని ఆ పార్టీ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. ఈడీ, ఈసీ, సీబీఐ తమ చేతుల్లోనే ఉన్నాయని బిజెపి ధీమాగా ఉందన్నారు. సిఎం కెసిఆర్‌ను బెదిరించేందుకే రాష్ట్రంలో ఈడీ, సీబీఐ దాడులు చేస్తున్నారని వెల్లడించారు. మునుగోడు నియోజకవర్గ ప్రజలు మతతత్వ రాజకీయాలకు దూరంగా ఉంటారని చెప్పారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టాలన్నా, పూర్తిచేయాలన్నా టిఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ప్రజలు సిఎం కెసిఆర్‌తోనే ఉన్నారని, ఉపఎన్నికలో గులాబీ పార్టీదే విజయమని ధీమా వ్యక్తంచేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/