అన్నాడీఎంకే కూటమి నుంచి తప్పుకున్న విజయకాంత్ పార్టీ

సీట్ల సర్దుబాటుపై కుదరని ఏకాభిప్రాయం

చెన్నై: త‌మిళ‌నాడు అధికార పార్టీ అన్నాడీఎంకే కూటమి నుంచి విజయ్‌కాంత్‌ నేతృత్వంలోని డీఎండీకే తప్పుకున్నది. ఎన్నిక‌ల్లో సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం కుద‌ర‌క‌పోవ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఇరు పార్టీల మ‌ధ్య పొత్తు కొన‌సాగుతుందా? అన్న సందిగ్థ‌త కొన్నాళ్లుగా ఉంది. సీట్ల పంపకాలపై పలు దఫాలుగా చర్చలు జరిగినా సఫలం కాకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు విజయ్‌కాంత్‌ తెలిపారు. తమకు 23 స్థానాలు కేటాయించాలని కోరగా అన్నాడీఎంకే నిరాకరించిందని, అందుకే కూటమి నుంచి వైదొలగినట్టు డీఎండీకే డిప్యూటీ సెక్రటరీ పార్థసారథి తెలిపారు.

కాగా, డీఎండీకేను తమ కూటమిలో చేరాలని మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్‌ ఆహ్వానించారు. ‘బ్లాక్‌ ఎంజీఆర్‌’ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే నటుడు విజయ్‌కాంత్‌.. 2006లో డీఎండీకే స్థాపించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం సరిగా లేకపోవడంతో రాజకీయాల్లో చురుగ్గాలేరు. ఆయన భార్య ప్రేమలత పార్టీ వ్యవహారాలు చూస్తున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/