ప్రగతి భవన్ ముట్టడికి వెళుతున్న వైస్ షర్మిల ను అరెస్ట్ చేసిన పోలీసులు

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిలను మరోసారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రగతి భవన్ ముట్టడికి ఆమె బయలుదేరగా సోమాజిగూడ లో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. షర్మిల వాహనానికి అడ్డంగా వాహనాలు నిలపడంతో పోలీసుల తీరుపై ఆమె ఫైర్ అయ్యారు. నిన్న టీఆర్ఎస్ శ్రేణుల దాడికి నిరసనగా షర్మిల ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. మరోవైపు ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రగతి భవన్ వద్ద వైఎస్సార్టీపీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకొని నిరసకు దిగారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

నిన్న సోమవారం వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగగిరి వద్ద షర్మిలను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై షర్మిల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సుదర్శన్‌రెడ్డి ఆయన భార్య సైతం ఎమ్మెల్యేలుగా చెలామణి అవుతూ డబ్బులు దండుకుంటున్నారని షర్మిల ఆరోపించారు. నర్సంపేట ఎమ్మెల్యే పేరుకే పెద్ది సుదర్శన్‌రెడ్డి అని, మనిషిది చిన్న బుద్ధి అని అన్నారు. ఉద్యమకారుడిగా ఉండి నేడు తొండ ముదిరి ఊసరవెల్లి ఐనట్లు కబ్జాకోరయ్యాడని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే అనుచరుల కన్నుపడితే భూమి మాయమవుతుందన్నారు. చివరికి లే ఔట్ల్‌లో గ్రీన్‌ల్యాండ్స్‌ను వదలడం లేదని పేర్కొన్నారు. ఆయనకు సంపాదన తప్ప మరో ధ్యాసలేదని, ఇలాంటి వారికి ఎందుకు ఓట్లు వేయాలని, కర్రుకాల్చి వాతపెట్టాలన్నారు. షర్మిల వ్యాఖ్యలపై టిఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేసారు. ఈ క్రమంలో ఆమెను అరెస్ట్ చేసి హైదరాబాద్ కు పంపించారు. ఈరోజు ప్రగతి భవన్ ముట్టడికి యత్నించడం తో అరెస్ట్ చేసారు.