ఏపీ ప్రభుత్వానికి మరో సలహాదారుడిగా పోతిరెడ్డి నాగార్జున రెడ్డి

ఏపీ సీఎం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సర్కార్ కు మరో సలహాదారుడిగా పోతిరెడ్డి నాగార్జున రెడ్డి నియమించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సలహాదారుడిగా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి. ఈ మేరకు కొత్త నియామకంపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన రెండేళ్లపాటు ఆ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కడప జిల్లా పోరుమామిళ్ళకు చెందిన పోతిరెడ్డి నాగార్జున రెడ్డి వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. ఆయన గతంలో ఎంపీపీగా, జడ్పిటిసి గా ఉన్నారు. అంతే కాదు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి తల్లి కృష్ణమ్మ రాష్ట్ర మహిళా ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ గా వ్యవహరించారు.

గతంలో టీటీడీ పాలక మండలి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేక ఆహ్వానితులను నియమించారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం.. అలాగే ప్రత్యేక ఆహ్వానితుల నియామకాన్ని తప్పుబట్టి ప్రభుత్వం జారీ చేసిన 568, 569 జీవోలను సస్పెండ్ చేయడం జరిగింది. ఇక ఇప్పుడు సర్కార్ కు సలహాదారుడిగా నియామకమయ్యారు.