రెండు రోజుల్లోనే కాఫర్ డ్యాం ఎత్తు పెంచారు

గతంలో ఎన్నడూ లేని విధంగా జులై నెలలో గోదావరికి భారీ వరద చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఎగువ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురవడం తో గోదావరి రికార్డ్స్ స్థాయిలో ప్రవహించింది. దీంతో అన్ని ప్రాజెక్ట్లు నిండిపొంగిపొర్లాయి. ఇక గోదావరికి భారీ వరద రావడంతో పోలవరం ప్రాజెక్టు వద్ద ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. వరదలను సమర్థంగా తట్టుకునేందుకు ఎగువ కాఫర్ డ్యాం ఎత్తును 1.2 మీటర్ల మేర పెంచాలని ఏపీ సర్కార్‌ నిర్ణయించింది. 2.5 కిలోమీటర్ల పొడువున ఉన్న కాఫర్ డ్యాంను ఒక మీటరు ఎత్తు, రెండు మీటర్ల మేర వెడల్పు పెంచేందుకు కాంట్రాక్టర్ మెఘా ఇంజినీరింగ్ సంస్థ నిర్ణయించింది.

ప్రభుత్వం నిర్ణయం ప్రకారం కేవలం రెండు రోజుల్లోనే కాఫర్ డ్యాంను పెంచేసింది. జులై 15 న పనులను ప్రారంభించి.. 17వ తేదీ కల్లా పనులు పూర్తి చేసింది. వరద నీరు ఎగువ కాఫర్ డ్యాం పై నుంచి ప్రవహించకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం 12 వేల క్యూబిక్ మీటర్ల రాక్ ఫిల్లింగ్ చేపట్టినట్లుగా తెలుస్తున్నది. ప్రస్తుతం ఎగువ కాఫర్ డ్యాం ఎత్తు 44 మీటర్ల ఎత్తుగా ఉన్నది. ప్రస్తుతం పోలవరం వద్ద ఎగువ కాఫర్‌ డ్యాం సమీపంలో 37.8 మీటర్ల స్థాయిలో గోదావరి నీటిమట్టం ఉన్నది. గోదావరి నదికి 1986లో అత్యంత భారీ వరద వచ్చింది. అప్పట్లో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 75.6 అడుగులుగా నమోదైంది. ఆ సమయంలో కాటన్ బ్యారేజీ వద్ద 36 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. 36 ఏళ్ల క్రితం వచ్చిన వరదలను తలపిస్తూ.. ఈసారి గోదావరి నదికి భారీగా వరదలొచ్చాయి. భద్రాచలం వద్ద వరద నీటిమట్టం 71.3 అడుగులు దాటింది. దీంతో పోలవరం వద్ద 26 లక్షల క్యూసెక్కుల నుంచి 30 లక్షల క్యూసెక్కుల వరకు వరద ప్రవాహం రావచ్చని అధికారులు అంచనా వేశారు. శుక్రవారం జల వనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. పోలవరం పరిస్థితి, కాఫర్ డ్యామ్ గురించి ఆరా తీశారు. గోదావరి వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకొని కాఫర్ డ్యామ్ ఎత్తు పెంచాలని సీఎం అప్పటికిప్పుడు నిర్ణయం తీసుకున్నారు.