వడ్డీరేట్లు యథాతథమే..ఆర్‌బీఐ

ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందన్న శక్తికాంత దాస్

YouTube video
Bi-monthly Monetary Policy address by RBI Governor, Shri Shaktikanta Das

ముంబయి: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పరపతి సమీక్ష తరువాత వడ్డీ రేట్లను సవరించడం లేదని గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. మూడు రోజుల పాటు పరపతి సమీక్షను జరిపిన బోర్డు నిర్ణయాలను ఈ ఉదయం దాస్ వెల్లడించారు. ఆరుగురు సభ్యుల బృందం అక్టోబర్ 7 నుంచి పరపతి సమీక్షను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆర్బీఐ నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన శక్తికాంత దాస్, రెపో రేటు 4 శాతం వద్ద, రివర్స్ రెపో రేటు 3.35 శాతం వద్ద కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఆర్థిక వృద్ధి నిదానంగా సాగుతున్న వేళ, వడ్డీ రేట్లను మరింతగా తగ్గించాల్సిన అవసరం లేదని భావిస్తున్నామని, ద్రవ్యోల్బణం కూడా అదుపులోనే ఉందని ఆయన అన్నారు. ద్రవ్యోల్బణం రానున్న మూడు నెలల వ్యవధిలో మరింతగా తగ్గుతుందని అంచనా వేస్తున్నామని, 2021 నాలుగో త్రైమాసికం నాటికి ఆర్బీఐ టార్గెట్ కు దగ్గరకు వస్తుందని భావిస్తున్నామని అన్నారు. గత పరపతి సమీక్షల తరువాత కీలక రేట్లను తగ్గించామని గుర్తు చేసిన శక్తికాంత దాస్, భారత రియల్ జీడీపీ 9.5 శాతం వరకూ తగ్గుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో స్వల్ప రికవరీ నమోదైందని, ఇది రెండో అర్ధభాగంలో మరింతగా నమోదవుతుందని, ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభంకావడం శుభసూచకమని అన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/