100 మంది భారతీయ విద్యార్థులపై పోలండ్ సైనికులు దాడి

గత నెల 26న ఘటన..వారందరినీ రొమేనియాలోని శరణార్థి శిబిరాలకు తరలించామన్న బెలారస్ రాయబారి

న్యూఢిల్లీ : ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించినప్పటి నుంచి కష్టాలు ఎదుర్కొంటున్న భారతీయ విద్యార్థులను మరిన్ని ఇబ్బందులు వెంటాడుతున్నాయి. భారత్ చేరుకోవాలంటే ఉక్రెయిన్‌ను వీడి పొరుగుదేశాలకు చేరుకోవాలని భారత ప్రభుత్వం సూచించింది. దీంతో వందలామంది భారత విద్యార్థులు త్రివర్ణ పతాకాన్ని చేబూని సరిహద్దు దేశాలకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి భారత ప్రభుత్వం సిద్ధం చేసిన విమానాల్లో స్వదేశానికి తరలివస్తున్నారు. ఇప్పటి వరకు వందలాదిమంది విద్యార్థులు ఇలా స్వదేశం చేరుకున్నారు.

గత నెలలో భారత విద్యార్థులకు ఎదురైన చేదు ఘటన ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దాదాపు 100 మంది భారతీయ విద్యార్థులు ఎలాగోలా పోలండ్ సరిహద్దుకు చేరుకుంటే అక్కడ వారికి చేదు అనుభవమే ఎదురైంది. సరిహద్దుకు చేరుకున్న వీరిపై పోలండ్ సైనికులు దాడిచేశారు. ఆపై తిరిగి ఉక్రెయిన్‌లోకి తిప్పి పంపించారు. గత నెల 26న ఈ ఘటన జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఐక్యరాజ్య సమితిలో బెలారస్ రాయబారి వాలెంటిన్ రిబకోవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆ విద్యార్థులందరినీ రొమేనియాలోని శరణార్థి శిబిరాలకు తిప్పి పంపినట్టు తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/