ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన గూగుల్ సీఈవో

భారత్‌లో గూగుల్ రూ.75వేల కోట్ల భారీగా పెట్టుబడులు..

pm-narendra-modi-sundar-pichai

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడి ఈరోజు ఉదయం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తో చర్చ జరిపారు. ఈ చర్చ ఎంతో ఫలవంతంగా సాగినట్టు మోడి వెల్లడించారు. విస్తృత స్థాయిలో అనేక అంశాలపై మాట్లాడుకున్నామని, ముఖ్యంగా, ఔత్సాహిక వ్యాపారవేత్తలు, యువత, రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అనువర్తింప చేయడంపైనా ఆసక్తికర చర్చ జరిగిందని తెలిపారు. “ఈ సంభాషణ సందర్భంగా, కరోనా పరిస్థితుల్లో సరికొత్త తరహా ఉద్యోగ సంస్కృతి ఏర్పడడంపై ప్రస్తావన వచ్చింది. ఈ కరోనా మహమ్మారి క్రీడారంగంతో పాటు అనేక రంగాలను కూడా ప్రభావితం చేయడంపై చర్చించుకున్నాం. డేటా భద్రత, ఇంటర్నెట్ రక్షణ అంశాల ప్రాధాన్యత గురించి కూడా మాట్లాడుకున్నాం. విద్య, విజ్ఞానం, డిజిటల్ ఇండియా, డిజిటల్ పేమెంట్స్ తదితర అంశాల్లో గూగుల్ చేపడుతున్న చర్యలు ముగ్ధుడ్ని చేశాయి” అంటూ వ్యాఖ్యానించారు.

దీనిపై సుందర్ పిచాయ్ స్పందిస్తూ ప్రధాని మోడికి కృతజ్ఞతలు తెలిపారు. మా కోసం ఎంతో విలువైన సమయం కేటాయించారంటూ ట్విట్టర్ లో ధన్యవాదాలు తెలిపారు. “డిజిటల్ ఇండియా కోసం మీ తపన ఎంతో ఆశావహ భావన కలిగిస్తోంది. ఈ దిశగా గూగుల్ తన కృషిని కొనసాగించేందుకు ఎంతో ఆసక్తిగా ఉంది” అంటూ స్పందించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/