భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని మోడీ..ప్రత్యేక పూజలు

పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు

pm-narendra-modi-in-warangal-bhadrakali-temple

వరంగల్‌ః వరంగల్ లోని భద్రకాళీ ఆలయంలో ప్రధాని నరేంద్ర మోడీకి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ప్రధాని ఈ రోజు ఉదయం నగరానికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. సుమారు పది నిమిషాల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రధాని మోడీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానానికి బయలుదేరి వెళ్లారు. ప్రధాని రాక సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకంగా ప్రసాదాలు తయారుచేసిన అర్చకులు.. వాటిని ప్రధానికి అందజేసి, ఆశీర్వదించారు.

ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో వరంగల్ లో పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. సుమారు 3,500 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుంచే సిటీలో పహారా పెంచారు. హోటళ్లతో సహా అన్ని దుకాణాలు మూసివేయించారు. ప్రధాని పర్యటించే రూట్ లో ట్రాఫిక్ ను మళ్లించిన పోలీసులు ఆ మార్గంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

ప్రధాని మోడీని స్వాగతించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ రాకపోవడంపై బిజెపి తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ.. ప్రధానమంత్రి రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఏ సందర్భంలోనూ సిఎం కెసిఆర్ రాలేదని గుర్తుచేశారు. ఆయనకు ముఖం చెల్లకనే ప్రధానిని కలుసుకోలేదని విమర్శించారు. ప్రధాని టూర్ ను బిఆర్ఎస్ పార్టీ బహిష్కరించినంత మాత్రాన పోయేదేంలేదని కిషన్ రెడ్డి తేల్చిచెప్పారు.