దేశ ప్రగతిలోనే మన అభ్యుదయం ఉంది : ప్రధాని

PM Modi’s keynote address at launch ceremony of ‘Azadi Ke Amrit Mahotsav se Swarnim Bharat Ke Ore’

న్యూఢిల్లీ : ‘ఆజాదీ కీ అమృత్ మహోత్సవ్ సే గోల్డెన్ ఇండియా కి ఓర్’ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నేడు ప్రధాని మోడీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమానత్వం, సాంఘిక న్యాయం పునాదులపై బలంగా నిలిచే సమాజాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఆలోచనలు, వైఖరి సృజనాత్మకంగానూ, నిర్ణయాలు ప్రగతిశీలంగానూ ఉన్న భారత దేశ ఆవిర్భావాన్ని మనం చూస్తున్నామన్నారు. నేడు కోట్లాది మంది భారతీయులు సువర్ణ భారత దేశానికి పునాది రాయి వేస్తున్నారని చెప్పారు. దేశ ప్రగతిలోనే మన అభ్యుదయం ఉందని చెప్పారు. మన వల్ల దేశం మనుగడ సాగిస్తుందని, దేశం వల్ల మనం మనుగడ సాగిస్తామని తెలిపారు. ఈ అవగాహన కలగడం నవ భారత నిర్మాణంలో భారతీయులకు అతి పెద్ద బలంగా మారుతోందని వివరించారు.

ఈ అమృత కాలం నిద్రపోతూ కలలు కనడానికి కాదని, జాగృతమవడం ద్వారా దృఢ సంకల్పాలను నెరవేర్చుకోవడానికేనని తెలిపారు. రానున్న పాతికేళ్ళు కఠోర శ్రమ, త్యాగం, అంకితభావం నిండిన శ్రద్ధ ఉచ్ఛ స్థితికి చేరుకునే కాలమని తెలిపారు. వందలాది సంవత్సరాల బానిసత్వంలో కోల్పోయినదానిని తిరిగి పొందే పాతికేళ్ళ సమయమిదని పేర్కొన్నారు. మన దేశానికి అంతర్జాతీయంగాగల కీర్తి, ప్రతిష్ఠలను నాశనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇవి కేవలం రాజకీయాలు మాత్రమేనని చెప్పుకుంటూ పక్కన పడేయకూడదని మోడీ చెప్పారు. ఇది మన దేశ పరువు, ప్రతిష్ఠలకు సంబంధించిన అంశమని తెలిపారు. భారత దేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి బ్రహ్మ కుమారీస్, ఇతర అంతర్జాతీయ సంస్థలు పోషించదగిన పాత్రను వివరించారు. వివిధ దేశాల ప్రజలకు మన దేశం గురించి సరైన సమాచారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. భారత దేశానికి వ్యతిరేకంగా ప్రచారమవుతున్న వదంతులు, పుకార్లపై పోరాడవలసిన బాధ్యత మనందరికీ ఉందని చెప్పారు.

.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/