జిల్లా కలెక్టర్లతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్

YouTube video
PM Modi’s closing remarks at interaction with DMs across India

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ నేడు ముఖ్యమైన ప్రభుత్వ పథకాలను అమలు చేయడంపై దేశవ్యాప్తంగా ఉన్న జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. దేశాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకుగల అడ్డంకులను అభ్యుదయ కాంక్షగల జిల్లాలు తొలగిస్తున్నాయని ప్రధాని ప్రశంసించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక యంత్రాంగం కలిసికట్టుగా ఓ జట్టుగా పని చేస్తుండటం వల్ల ఈ జిల్లాల్లో సత్ఫలితాలు వస్తున్నాయన్నారు. ఇతరుల ఆకాంక్షలు మన సొంత ఆకాంక్షలు అయినపుడు, ఇతరుల కలలు నెరవేరడం మన విజయానికి కొలమానం అయినపుడు, ఆ కర్తవ్య మార్గం చరిత్రను సృష్టిస్తుందని చెప్పారు. నేడు అభ్యుదయ కాంక్షగల జిల్లాల్లో ఈ చరిత్రను సృష్టిస్తుండటం మనం చూస్తున్నామన్నారు. పై స్థాయి నుంచి క్రింది స్థాయికి, అదేవిధంగా క్రింది స్థాయి నుంచి పై స్థాయి వరకు పరిపాలన ప్రక్రియ సజావుగా జరగడం కోసం పాలనా యంత్రాంగం, ప్రజల మధ్య ప్రత్యక్ష, మానసిక అనుబంధం ఉండాలని పిలుపునిచ్చారు. అభ్యుదయ కాంక్షగల జిల్లాల్లో మన దేశం సాధిస్తున్న విజయాలకు ప్రధాన కారణం ఏకాభిముఖత, కేంద్రీకరణ అని తెలిపారు.

అవే వనరులు, అదే ప్రభుత్వ యంత్రాంగం, ఆ అధికారులే అయినప్పటికీ ఫలితం మాత్రం విభిన్నంగా ఉందన్నారు. సుపరిపాలనకు జిల్లా యంత్రాంగం చాలా అవసరమని చెప్తూ, పథకాలను మెరుగ్గా అమలు చేయడానికి జిల్లా యంత్రాంగం దోహదపడుతుందన్నారు. క్షేత్ర స్థాయి సందర్శన, తనిఖీలకు సవివరమైన మార్గదర్శకాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగంలో చేరిన మొదటి రోజు ఎలాంటి ఉత్సాహంతో ఉన్నారో అదే ఉత్సాహంతో దేశ కోసం సివిల్ సర్వెంట్లు పని చేయాలని పిలుపునిచ్చారు. అభ్యదయ కాంక్షగల ప్రతి జిల్లాలోనూ గడచిన నాలుగేళ్ళలో జన్ ధన్ ఖాతాలు నాలుగు నుంచి ఐదు రెట్లు పెరిగాయన్నారు. దాదాపు ప్రతి కుటుంబానికి ఓ మరుగుదొడ్డి ఉందన్నారు. ప్రతి గ్రామంలోనూ విద్యుదీకరణ జరిగిందన్నారు. పేదల ఇళ్ళకు విద్యుత్తు చేరడం మాత్రమే కాకుండా ప్రజల జీవితాల్లో శక్తిని నింపిందన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/