ఏనుగుపై సఫారీ చేస్తూ పార్క్ విశిష్ఠతలు తెలుసుకున్న మోడీ

pm-modi-visited-kaziranga-national-park-in-assam

అసోం : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈశాన్య రాష్ట్రం అసోం పర్యటనలో ఉన్నారు. శనివారం ఉదయం రాష్ట్రంలోని కజిరంగా నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్‌లను ఆయన సందర్శించారు. ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన కజిరంగా నేషనల్ పార్క్‌లో ప్రధాని మోడీ ఏనుగుపై సఫారీ చేశారు. పార్క్‌లోని సెంట్రల్ కోహోరా రేంజ్‌లో ఉన్న మిహిముఖ్ ప్రాంతంలో ఏనుగుపై సఫారీ చేస్తూ పార్క్‌ విశిష్ఠతలను అడిగి తెలుసుకున్నారు. కెమెరాతో ఫొటోలు తీస్తూ కనిపించారు. అనంతరం అదే రేంజ్‌లో జీప్‌లో ప్రయాణించారు. ప్రధాని వెంట పార్క్ డైరెక్టర్ సోనాలి ఘోష్, ఇతర సీనియర్ అటవీ శాఖ అధికారులు ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం సాయం అసోంకు వెళ్లారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మోడీ ప్రారంభించనున్నారు. దాదాపు రూ.18,000 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఒక బహిరంగ సభలో కూడా ఆయన ప్రసంగించనున్నారు.