హిరోషిమాలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ

PM Modi Unveils Mahatma Gandhi’s Bust at Peace Park Near Hiroshima Atomic-Bomb

హిరోషిమా: ప్రధాని మోడీ జపాన్‌లోని హిరోషిమా పట్టణంలో జాతిపిత మహాత్మ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. జీ7 సదస్సులో పాల్గొనేందుకు ఫ్యూమియో కిషిడా ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ జపాన్‌కు వెళ్లారు.ఈ మేరకు మోడీ శనివారం హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన మోడీ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం దొరకడం తన అదృష్టమన్నారు . హిరోషిమా అనే పదం వింటేనే ఇప్పటికీ ప్రపంచం భయపడుతోందన్నారు. తాను జపాన్ ప్రధానికి బహుమతిగా ఇచ్చిన బోధి వృక్షాన్ని హిరోషిమాలో నాటారని తెలిసి హర్షం వ్యక్తం చేశారాయన. ఇక్కడి మహాత్మాగాంధీ విగ్రహం అహింసా సిద్ధాంతాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని మోడీ ఆకాంక్షించారు. కాగా రెండో ప్రపంచ యుద్ధంలో భాగంగా 1945, ఆగస్టు 6న అమెరికా జరిపిన అణు దాడి కారణంగా జపాన్‌లోని హిరోషిమా పట్టణం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘోర దుర్ఘటనలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దీని తాలుకు దుష్ప్రభావాలతో ఇప్పటికీ అక్కడ చాలామంది అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. అలాంటి అణుభూమిలోనే శాంతి సందేశంగా గాంధీ విగ్రహం ఇప్పుడు కొలువు తీరింది. కాగా, జపాన్‌ ప్రధాని కిషిడా సొంతూరు హిరోషిమానే కావడం గమనార్హం.

అంతకుముందు వార్షిక జీ-7 సదస్సు కోసం జపాన్‌కు చేరుకున్న ప్రధానికి జపాన్ ప్రతినిధులు, భారత దౌత్యవేత్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎయిర్‌ పోర్టులో ప్రవాస భారతీయులతో కాసేపు మాట్లాడారు మోడీ. సుమారు ఆరు రోజుల పాటు జపాన్‌లోనే పర్యటించనున్నారు ప్రధాని. భారత్‌, జపాన్‌లతో పాటు అమెరికా, కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, ఇండోనేసియా, దక్షిణ కొరియా, వియత్నాం తదితర దేశాల అధినేతలు ఈ జీ-7 సదస్సుకు హాజరుకానున్నారు.