మ‌హ‌ర్షి వాల్మీకి విమానాశ్ర‌యాన్ని ప్రారంభించిన ప్ర‌ధాని మోడీ

ఢిల్లీ నుంచి అయోధ్య‌కు తొలి విమానం

pm-modi-today-inaugurated-valmiki-airport-in-ayodhya

అయోధ్య: ఈరోజు అయోధ్య‌లో ప్ర‌ధాని మోడీ మ‌హ‌ర్షి వాల్మీకి అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యాన్ని ప్రారంభించారు. శ్రీరామ‌జ‌న్మ‌భూమిలో రామాల‌యాన్ని నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. ఆ ఆల‌యాన్ని జ‌న‌వ‌రి 22వ తేదీన ఓపెన్ చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఇవాళ అయోధ్య న‌గ‌ర స‌మీపంలో నిర్మించిన వాల్మీకి విమానాశ్ర‌యాన్ని ప్రారంభించారు. ప‌లు న‌గ‌రాల నుంచి ఈ విమానాశ్ర‌యానికి ప్ర‌తి రోజు స‌ర్వీసుల‌ను న‌డ‌ప‌నున్నారు.

సంవ‌త్స‌రానికి దాదాపు 10 ల‌క్ష‌ల మంది విమాన ప్ర‌యాణం చేసే విధంగా ఎయిర్‌పోర్టును నిర్మించారు. ఇక విమానాశ్ర‌యంలో రామాయ‌ణ ఇతివృత్తం ద‌ర్శ‌న‌మిచ్చేలా పేయింటింగ్స్ వేశారు. వాల్మీకి రాసిని రామాయ‌ణం ఆధారంగా ఆ క‌ల‌ర్‌ఫుల్ మ్యూర‌ల్స్ వేశారు. రూ.1450 కోట్ల‌తో వాల్మీకి విమానాశ్ర‌యాన్ని నిర్మించిన‌ట్లు పీఎంవో ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

వాల్మీకి విమానాశ్ర‌యాన్ని ఓపెన్ చేయ‌గానే.. ఢిల్లీ నుంచి అయోధ్య‌కు ఇవాళ మ‌ధ్యాహ్నం ఇండిగో విమానం బ‌య‌లుదేరింది. ఆ విమాన కెప్టెన్ అశుతోష్ శేఖ‌ర్ .. అయోధ్య ప్ర‌యాణికుల‌కు వెల్క‌మ్ చెప్పారు. జై శ్రీరామ్ అంటూ ప్ర‌యాణికులు నినాదాలు చేశారు.

కాగా, అయోధ్య ధామ్ రైల్వే స్టేష‌న్ ప్రారంభోత్స‌వానికి ముందు ప్ర‌ధాని మోడీ.. న‌గ‌రంలో రోడ్ షో నిర్వ‌హించారు. క‌ళాకారుల ప్ర‌ద‌ర్శ‌న వీక్షించారు. ఇద్ద‌రు పిల్ల‌ల‌ను క‌లిసి వారితో ఫోటోలు దిగారు. ల‌తా మంగేష్క‌ర్ చౌక్ వ‌ద్ద త‌న కాన్వాయ్ దిగి అక్క‌డ కాసేపు గ‌డిపారు.