ఏషియన్ గేమ్స్‌లో పాల్గొన్న భారత అథ్లెట్లను కలవనున్న ప్రధాని మోడీ

PM Modi To Meet India’s Asian Games Contingent Tomorrow As Athletes Bag Record Medals

న్యూఢిల్లీః ఏషియన్ గేమ్స్‌లో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలసిందే. ఈ క్రీడల్లో భారత్ 107 పతకాలు(28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలు) సాధించి.. పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే ఏషియన్ గేమ్స్‌లో పాల్గొన్న భారతీయ అథ్లెట్ల బృందంతో ప్రధాని మోడీ సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు. అక్టోబరు 10వ తేదీ సాయంత్రం 4:30 గంటలకు న్యూ ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో ఏషియన్ గేమ్స్‌లో పాల్గొన్న భారతీయ అథ్లెట్ల బృందంతో ప్రధాని మోడీ సంభాషించనున్నారు. అనంతరం మోడీ ప్రసంగం చేయనున్నారు. ఈ సందర్భంగా భారతదేశానికి గొప్ప విజయాలు సాధించిన క్రీడాకారులను దేశప్రజల తరపున ప్రధాని నరేంద్ర మోడీ అభినందించనున్నారు.

ఏషియన్ గేమ్స్‌లో అత్యుత్తమ విజయాలు సాధించిన క్రీడాకారులను అభినందించేందుకు, భవిష్యత్తులో జరిగే పోటీలకు వారిని ప్రోత్సహించేందుకు ప్రధాన మంత్రి ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఏషియన్ గేమ్స్‌లో 2022లో 28 బంగారు పతకాలతో సహా భారతదేశం మొత్తం 107 పతకాలను గెలుచుకుంది. ఏషియన్ గేమ్స్ చరిత్రలో.. భారత్ సాధించిన పతకాల సంఖ్య ప్రకారం ఇది దేశ అత్యుత్తమ ప్రదర్శన. దీంతో భారత అథ్లెట్ల ప్రదర్శనపై దేశం మొత్తం గర్విస్తోంది. ప్రధాని మోడీ హాజరయ్యే ఈ కార్యక్రమానికి ఆసియా క్రీడల కోసం భారత బృందంలోని అథ్లెట్లు, వారి కోచ్‌లు, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధికారులు, జాతీయ క్రీడా సమాఖ్యల ప్రతినిధులు, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ అధికారులు హాజరుకానున్నారు.