ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం.. భారత్ నిశితంగా పరిశీలిస్తోందిః మంత్రి హ‌ర్దీప్ సింగ్ పూరీ

ముడిచ‌మురు ధ‌ర‌లు పెరిగితే ముప్పు త‌ప్ప‌దు..పెట్రోలియం మంత్రి

Israel-Hamas war: India monitoring conflict closely, says oil minister

న్యూఢిల్లీ : ఇజ్రాయెల్‌, హ‌మాస్ మ‌ధ్య భీక‌ర దాడులతో అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ముడిచ‌మురు ధ‌ర‌లు బ్యారెల్‌కు 3 డాల‌ర్లు పైగా పెరిగిన క్ర‌మంలో కేంద్ర పెట్రోలియం, స‌హ‌జ వాయువు మంత్రి హ‌ర్దీప్ సింగ్ పూరీ మాట్లాడుతూ..ఇజ్రాయెల్‌-హ‌మాస్ వార్ నేప‌ధ్యంలో మ‌ధ్య ప్రాచ్యంలో నెల‌కొన్న వివాదాన్ని భార‌త్ నిశితంగా ప‌రిశీలిస్తోంద‌ని పేర్కొన్నారు.

హ‌మాస్ దాడులతో మధ్య‌ప్రాచ్యంలో రాజ‌కీయ అనిశ్చితి కార‌ణంగా చ‌మురు స‌ర‌ఫరాల‌పై ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డుతుంద‌నే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. వివాదం సాగుతున్న ప్రాంతంలో వాణిజ్య ప్రాధాన్య‌త‌పై ఢిల్లీలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో పెట్రోలియం మంత్రి హ‌ర్దీప్ సింగ్ పూరీ మాట్లాడుతూ అంత‌ర్జాతీయ ఇంధ‌నానికి ఆ ప్రాంతం సెంట్ర‌ల్ హ‌బ్‌గా ఉంద‌ని, ఎలాంటి ప‌రిస్ధితులు ఉత్ప‌న్న‌మైనా భార‌త్ దీటుగా ఎదుర్కొనేందుకు స‌న్న‌ద్ధంగా ఉంద‌ని అన్నారు.

అంత‌ర్జాతీయంగా ఇలాంటి అనిశ్చితి ప‌రిస్ధితులు సుర‌క్షిత ఇంధ‌నాల వినియోగం ప్రాధాన్య‌త‌ను పెంచుతాయ‌ని చెప్పారు. ముడిచ‌మురు ధ‌ర‌లు బ్యారెల్‌కు 100 డాల‌ర్లు దాటితే ద్ర‌వ్యోల్బ‌ణం ప‌రుగులు పెడుతుంద‌ని, భార‌త్ వంటి ముడిచ‌మురు దిగుమ‌తి దేశాలపై ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డుతుంద‌ని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.