నేడు మరో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ

PM Modi to flag off Bhopal-Delhi Vande Bharat Express today

న్యూఢిల్లీః . ప్రధాని మోడీ ఈరోజు ఢిల్లీ-భోపాల్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రధాని మోడీ మధ్యప్రదేశ్ లోని భోపాల్‌లో పర్యటించనున్నట్లు పీఎంఓ కార్యాలయం పేర్కొంది. భోపాల్-న్యూఢిల్లీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును రాణి కమలాపతి స్టేషన్‌లో ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ పర్యటనలో భాగంగా కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్‌లో కూడా మోడీ పాల్గొంటారని ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. శనివారం ఉదయం ప్రధాని మోడీ భోపాల్ చేరుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3.15 గంటలకు రైలుకు పచ్చజెండా ఊపనున్నారు. ఈ రైలు 708 కిలోమీటర్ల ప్రయాణాన్ని కేవలం 7.45 గంటల్లో పూర్తి చేయనుంది. ఈ రైలు గరిష్ట వేగం గంటకు 160 కి.మీ. ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ రైలు భోపాల్‌లో ఉదయం 5.55 గంటలకు బయలుదేరి 11.40 గంటలకు ఆగ్రా చేరుకుంటుంది. మధ్యాహ్నం 1.45 గంటలకు ఢిల్లీ చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ఈ వందేభారత్‌ రైలు శనివారం మినహా ప్రతిరోజు నడుస్తుందని అధికారులు తెలిపారు. ఢిల్లీ-భోపాల్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈరోజు ఏప్రిల్ 3 నుంచి రాకపోకలు సాగిస్తుందని అధికారులు తెలిపారు. సీట్ల రిజర్వేషన్ ఈరోజు నుంచి ప్రారంభంకానుంది.

కాగా.. వచ్చే మూడేళ్లలో 400 వందేభారత్ రైళ్లను నడపాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనిలో భాగంగా వందేభారత్‌ సర్వీసులను పెంచుతూ వస్తోంది. ఈ వందేభారత్ రైలుతో పదకొండు సర్వీసులు దేశంలో రాకపోకలు సాగించనున్నాయి. ఇప్పటివరకు కేంద్రం 10 రైళ్లను ప్రారంభించింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో అత్యాధునికమైన‌ సౌకర్యాలు ఉన్నాయి. ఈ సెమీ హైస్పీడ్‌ రైలు గంటకు 160 కిలో మీటర్ల వేగంతో దూసుకుపోనుంది.